Google | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సోమవారం గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ ఇతర సర్వీసులు నిలిచిపోయాయంటూ గూగుల్ యూజర్లు ఫిర్యాదులు చేశారు. అమెరికాలో ఉదయం 9 గంటలకు గూగుల్ సర్వీసులు ప్రభావితమైనట్టు తెలుస్తున్నది. సర్వీసులు నిలిచిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. లాస్ఏంజెల్స్, న్యూయార్క్ సిటీలో సర్వీసుల అంతరాయం ఎక్కువగా జరిగినట్టు డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ మ్యాప్ పేర్కొన్నది. ఈ వెబ్సైట్ ఆన్లైన్లో వచ్చే అంతరాయాలను పర్యవేక్షి స్తుంటుంది.
గూగుల్ సేవల అంతరాయానికి సంబంధించి అమెరికా, యూకే, ఐరోపా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. కొంత సేపటికే సర్వీసులు యథాతథంగా పనిచేస్తున్నాయని కొంత మంది పేర్కొన్నారు. కాగా, ఈ అంతరాయానికి సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల క్రౌడ్ స్ట్రెయిక్ కారణంగా విండోస్‌లో తీవ్ర సమస్య తలెత్తిన నేపథ్యంలో తాజాగా గూగుల్ సమస్య ఎదురుకావడం గమనార్హం.
జహానాబాద్: బీహార్‌లోని జహానాబాద్ జిల్లాలో ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ దేవాలయంలో ఆదివారం రాత్రి 11.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికులు కన్వర్ భక్తులని జిల్లా కలెక్టర్ అలంకృత పాండే తెలిపారు. దేవాలయంలోని భద్రతా సిబ్బంది సత్వరమే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు.