Ratna Bhandar | దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీలో జగన్నాథ దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తాడు. ఆలయానికి రత్నభండాగారం ఉంటుంది. దీంట్లోనే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆభరణాలు భద్రపరుస్తుంటారు. అనేకమంది రాజులు, భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను ఈ రత్న భాండాగారంలోనే దాచి పెట్టారని.. ఇందులో ఉన్న ఆభరణాల విలువ వేలకోట్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఆలయ రత్న భండార్‌ను తిరిగి తెరిచేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో పూరీలో శనివారం కమిటీ తొలి సమావేశం జరిగింది. అయితే, భాండాగారాన్ని తిరిగి తెరిచేందుకు ఈ నెల 9న కమిటీ సమావేశమై తేదీని నిర్ణయించనున్నది.
కమిటీ సమావేశం అనంతరం జస్టిస్ విశ్వనాథ్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ.. లభ్యమైన పత్రాలు, రికార్డులను పరిశీలించిన తర్వాత పూరీ ప్రభుత్వ ఖజానాలో రత్నభాండార్ డూప్లికేట్ కీ ఉన్నట్లు తేలిందన్నారు. అందుకే మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే సమావేశంలో కమిటీ ముందు రత్నభాండార్ డూప్లికేట్ కీని సమర్పించాలని జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ప్యానెల్ మెంబర్ కన్వీనర్‌ను కోరినట్లు చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా ఆలయ ఖజానా లోపలి గది తెరవలేదన్నారు. తెరుచుకోకపోతే తాళాలను పగులగొట్టేందుకు ప్రభుత్వ ఆమోదంతో ఎస్ఓపీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఖజానాలో నిల్వ ఉన్న నగలు, విలువైన వస్తువులను వేరే చోటికి తరలించకుండా మరమ్మతు పనులు ప్రారంభించలేమని కమిటీ గుర్తించిందన్నారు. మరమ్మతుల సమయంలో ఆభరణాలు, ఆభరణాలు సక్రమంగా భద్రపరిచేలా ఆలయ నిర్వహణ కమిటీని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. చివరిసారి హైదరాబాద్, చెన్నై నుంచి నిపుణులను పిలిపించి ఆభరణాల జాబితాను తయారు చేశారన్నారు. వార్షిక రథయాత్రలో మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు తిరిగి ఆలయానికి తిరి చేరుకునే వరకు ఆభరణాలను తరలించే పనులను పూర్తి చేస్తామన్నారు.