Supreme Court | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఏప్రిల్ 1న ఫుల్ కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు పలువురు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను అందించారు. వాటిని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ వివరాల ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా రూ. 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు కలిగి ఉన్నారు.
అలాగే, దక్షిణ ఢిల్లీలో మూడు బెడ్రూంల డీడీఏ ఫ్లాట్, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో 2,446 చదరపు అడుగులతో కూడిన నాలుగు బెడ్రూంల అపార్ట్‌మెంట్‌తో పాటు మరికొన్ని లక్షల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ బ్యాంకు ఖాతాలో రూ. 19.63 లక్షల నగదు, ముంబై, ఢిల్లీలో అపార్ట్మెంట్లు మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. మొత్తం 33 మంది న్యాయమూర్తులలో 21 మంది తమ ఆస్తుల వివరాలను ప్రజల ముందుంచారు.