కోల్‌కతా, జూలై 7: రాజ్‌భవన్‌పై దుష్ప్రచారం చేస్తూ అపకీర్తి తెస్తున్నారనే ఆరోపణలతో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, సెంట్రల్ జోన్ డీసీపీ ఇందిరా ముఖర్జీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ప్రభుత్వ అధికార పదవికి తగని విధంగా పని చేస్తున్నారు’ అని వారిపై జూన్‌లో గవర్నర్ సీవీ ఆనంద బోస్ హోంశాఖకు ఒక నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులు తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినా ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు మాత్రం వారిని అడ్డుకుంటున్నారని గవర్నర్ ఈ నివేదికలో పేర్కొన్నారు. ఓ రాజ్‌భవన్ ఉద్యోగినితో కలిసి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలో చర్యలకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది.
రూ.2500తో వందలాది మందికి టోకరా
న్యూఢిల్లీ, జూలై 7: కేవలం రూ.2500 ఖర్చు చేసి ఫేక్ సిమ్ కార్డులు, 10 వేల మంది ఫోన్ డాటాను సంపాదించిన ఓ ముఠా, పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు తెర లేపింది. ఏకంగా ఓ ‘నకిలీ కాల్ సెంటర్’నే ఆ ముఠా ఏర్పాటు చేసుకోగలిగింది. తమ దగ్గరున్న మొబైల్ ఫోన్ డాటా ఆధారంగా, నిత్యం అనేక మందికి ఫోన్లు చేస్తూ..రుణాలు ఇప్పిస్తామని, భారీగా రాబడిని ఇచ్చే బీమా పాలసీలు ఉన్నాయని అమాయక పౌరులకు ఆశలు కల్పించింది. నోయిడా కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా ఆగడాలను ఎట్టకేలకు అక్కడి పోలీసులు అడ్డుకట్ట వేశారు. నోయిడా సెక్టార్-51లో ముఠాకు సంబంధించి కీలక వ్యక్తులతో సహా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.