Celebrity Couple : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి (Terror attack) నుంచి ఓ సెలెబ్రిటీ జంట తృటిలో తప్పించుకుంది. నటి దీపికా కాకర్ (Dipika Kakar) తన భర్త షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) ఇటీవల జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. ఆదివారం విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో వారి అభిమానులు ఆందోళన చెందారు. ఉగ్రదాడిలో వారు కూడా చిక్కుకున్నారేమోనని భయపడ్డారు. ఈ నేపథ్యంలో తాము క్షేమంగానే ఉన్నామంటూ తాజాగా దీపికా, షోయబ్ సోయబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం ఉదయమే తాము ఢిల్లీకి చేరుకున్నామంటూ ఓ పోస్ట్ పెట్టారు.
‘మేము క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాం. సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి’ అని ఇన్‌స్టాలో ఆ సెలెబ్రిటీ కపుల్ తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని షోయబ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు విమర్శలకు దారితీసింది. దేశమంతా బాధపడుతుంటే మీరు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్‌లోని కొండల మధ్య పర్యాటకులపై పాశవికంగా దాడి చేశారు. ఈ దాడిలో 28 మందిని పొట్టనపెట్టకున్నారు.