బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 08:59:03

పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ

పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్‌ వినియోగదారులపై చమురు కంపెనీలు దయతలిచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు డీజిల్‌ ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ డీజిల్‌పై 48 పెంచగా, పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో మొదటిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర అధికమయ్యింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88కి చేరగా, పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. దీంతో గత 18 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.8.50, రూ.10.48 చొప్పున పెరిగాయి. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012, జూన్‌ 18న దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.71.16, డీజిల్‌ ధర రూ.40.91గా ఉన్నది. ప్రస్తుతంతో పోల్చితే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 పెరగగా, డీజిల్‌ ధర 39.15 పైసలు పెరిగింది. గత మార్చి 14న ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.3 విధించగా, మే 5న పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఈ రెండు పెంపులతో ప్రభుత్వానికి అదనంగా రూ.2 లక్షల కోట్లు వచ్చాయి.


logo