లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 5: వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో పెద్ద ఫార్మా కంపెనీలో ఉద్యోగాన్ని వదిలి, కొత్త టెక్నాలజీతో సాగును కొత్త పుంతలు తొక్కించి వార్తల్లో నిలిచిన శుభ్రాంత్ శుక్లా యోగి ఆదిత్యనాథ్ సర్కారు విధానాలతో అప్పుల్లో మునిగిపోయారు. వ్యవసాయాన్ని వదిలివేశారు. తాను వ్యవసాయాన్ని వదిలివేయడానికి యోగి ప్రభుత్వ చర్యలే కారణం అని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. లఖింపూర్ ఖీరీ జిల్లాలోని పండిత్ పూర్వ సూరజ్‌కుండ్ శుభ్రాంత్ శుక్లా స్వగ్రామం. 2010కి ముందు శుక్లా ర్యాన్‌బాక్సీ ఫార్మా కంపెనీలో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేశారు. తర్వాత వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలిపెట్టారు. చెరకు సాగు ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలతో వార్తల్లో నిలిచారు. అయితే, కొన్నేండ్లుగా నష్టాలు రావడంతో 2019లో శుక్లా వ్యవసాయాన్ని వదిలిపెట్టారు.
పెద్ద కంపెనీలకే లాభాలు
యోగి అధికారంలోకి వచ్చాక వ్యవసాయంలో నష్టాలు పెరిగాయని శుక్లా చెప్పారు. ‘ రైతుల విధానంలో యోగి ప్రభుత్వం అశ్రద్ధ వహించింది. వ్యవసాయ విధానాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది’ అని అన్నారు. ‘డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో సాగు ఖర్చు పెరిగింది. మా చెరకు బిల్లులు గతేడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో అప్పులు పెరిగాయి. వ్యవసాయం భారంగా మారింది’ అని పేర్కొన్నారు. మాయావతి, అఖిలేశ్ అధికారంలో ఉన్నప్పుడు చెరకు బిల్లులు రెండు నెలల్లోగా చెల్లించేవారని, ఇప్పుడు ఏండ్లు గడుస్తున్నా ఇవ్వడం లేదని వాపోయారు.