పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. (Rabri Devi Counters Nitish Kumar) సీఎం నితీశ్ కుమార్ పాలనలో ఏ పని జరుగలేదని మండలిలో ప్రతిపక్ష నాయకురాలైన రబ్రీ దేవి ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
కాగా, సీఎం నితీశ్ కుమార్ తన సీటు నుంచి లేచారు. ఆర్జేడీ హయంలోనే ఎలాంటి పని జరుగలేదని అన్నారు. తాను రాష్ట్ర పగ్గాలు చేపట్టే ముందు బీహార్ మహిళలకు బట్టలు లేవని అన్నారు ‘మహిళల కోసం ఏదైనా పని జరిగిందా? మేం ఎంత చేశాం? వారు మహిళలకు విద్య కూడా అందించలేదు. మహిళలు ఎలా ముందుకు వచ్చారో మీకు తెలుసా? భర్త (లాలూ ప్రసాద్ యాదవ్) రాజీనామా చేసినప్పుడు, ఆమె (రబ్రీ దేవి)ను ముఖ్యమంత్రిని చేశాడు. సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు అడుగు పెట్టలేకపోయారు. ఇప్పుడు పురుషులు, మహిళలు చాలా ఆలస్యంగా ఇళ్లకు వస్తున్నారు’ అని అన్నారు.
మరోవైపు ఆర్జేడీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలకు రబ్రీ దేవి కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆమె మాట్లాడారు. నితీశ్ కుమార్ను ‘భాంగ్రీ’ అని సంబోధించారు. ‘ఆయన భాంగ్ (గంజాయి) తింటారు. సభకు వచ్చి మహిళల గురించి చెత్తగా మాట్లాడతారు. మహిళలను అవమానిస్తారు. 2005కు ముందు బీహార్లోని మహిళలకు బట్టలు లేవు అని అంటారు. నితీశ్ కుమార్ను నేను అడగాలనుకుంటున్నా. ఆయన కుటుంబంలోని మహిళలు నాడు నగ్నంగా తిరిగారా? మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం మేం ఏమి చేశామో బీహార్ ప్రజలకు తెలుసు’ అని అన్నారు.