Diana Award | న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లోని శ్రీరామ్ స్కూల్లో చదువుతున్న అన్వి కుమార్ (17)కు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు లభించింది. మానవతావాద లేదా సాంఘికపరమైన కార్యక్రమాలతో మంచి మార్పు కోసం కృషి చేసే యువతకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ప్రిన్సెస్ డయానా స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. అన్వి కుమార్ భారత దేశంలో మానసిక ఆరోగ్య విద్యలో సకారాత్మక పరివర్తన తేవడానికి చెప్పుకోదగ్గ కృషి చేశారని ఈ కమిటీ తెలిపింది.
అన్వి ‘మైండ్ కాన్వాస్’ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారని పేర్కొంది. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి కళలు, కథలు చెప్పడాన్ని ఆమె అనుసరించారని తెలిపింది. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లో అంతరాలను గుర్తించారని వివరించింది.