సూరత్: గుజరాత్లో డైమండ్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మాంద్యం కారణంగా పాలిష్డ్ డైమండ్లకు డిమాండ్ లేకపోవడంతో సూరత్‌కు చెందిన ఓ డైమండ్ మాన్యుఫాక్షరింగ్ సంస్థ 50 వేల మంది ఉద్యోగులకు 10 రోజుల వెకేషన్ ప్రకటించింది. ‘ఈ నెల 17 నుంచి 27 వరకు 50 వేల మంది మా ఉద్యోగులకు వెకేషన్ ప్రకటించాం. కొంత మొత్తం తగ్గించినా, ఈ వ్యవధికి ఉద్యోగులకు వేతనం అందజేస్తాం. మాంద్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాంద్యంతో నేను అలసిపోయా’ అని కిరణ్ జెమ్స్ కంపెనీ చైర్మన్ వల్లభ్ బాయ్ లఖాని తెలిపారు. ఇతర సంస్థలు కూడా ప్రభావితమైనప్పటికీ అవి సైలెంట్‌గా ఉన్నాయని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే తాము ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
తమ ఉత్పత్తిని క్రమబద్ధీకరించేందుకు వెకేషన్ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ఈ మాంద్యం వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదన్నారు. 95 శాతం పాలిష్డ్ డైమండ్లు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో, వీటి అమ్మకాలపై అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధాలు కూడా ప్రస్తుత పరిస్థితికి ఓ కారణంగా చెప్పారు. సూరత్‌లోని 4 వేల డైమండ్ పాలిషింగ్ కంపెనీలు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగులకు వెకేషన్ కారణంగా ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.