న్యూఢిల్లీ: గర్భిణులకు మధుమేహం ఉంటే వారికి పుట్టే పిల్లలకు ఆటిజం లాంటి నరాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ది లాన్సెట్ డయబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. డయబెటిస్ లేని గర్భిణులతో పోలిస్తే ఆ వ్యాధి ఉన్న గర్భిణులకు పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే ముప్పు 25 శాతం, శ్రద్ధ లోపించిన హైపర్ యాక్టివిటీ (ఏడీహెచ్డీ) రుగ్మత వచ్చే ప్రమాదం 30 శాతం, మేధో వైకల్యం వచ్చే ముప్పు 32 శాతం ఎక్కువని అధ్యయనం తెలిపింది. అలాగే కమ్యూనికేషన్, అభ్యసనం, కదలికలకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఎక్కువని అధ్యయనం తెలిపింది. అయితే ఇందుకు సాక్ష్యాధారాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా గర్భిణులు టైప్ -1, 2 డయబెటిస్ బారిన పడటం పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఊబకాయం, నిశ్చల జీవనశైలి, 35 ఏండ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల గర్భిణులకు డయబెటిస్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ అధ్యయనం కోసం 200 పాత అధ్యయనాల్లోని 5.6 కోట్ల తల్లీ పిల్లల జతలను పరిశీలించారు. గతంలోని అధ్యయనాలు కూడా గర్భిణికి మధుమేహం ఉంటే దాని ప్రభావం పిండం మెదడు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని.. పిల్లల ఆటిజం, ఏడీహెడీ, దీర్ఘకాల నరాల వ్యాధులకు, తల్లి మధుమేహానికి సంబంధం ఉందని సూచించాయి. ఈ విషయమై లోతుగా పరిశోధించాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.