Dhvani missile : రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి (Hypersonic Missile) ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఇందులోభాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) ‘ధ్వని (Dhvani)’ పరీక్షలను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని DRDO ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో దడ పుట్టించిన బ్రహ్మోస్ (BrahMos) కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇదిలావుంటే అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం హెచ్జీవీల సొంతం. శబ్దవేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించగలవు. డీఆర్డీఓ సిద్ధం చేస్తోన్న హెచ్జీవీని సుమారు గంటకు 7 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 1500 నుంచి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా వేస్తున్నారు. వేగంతోపాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుంది. రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి.. అక్కడ నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ హెచ్‌జీవీ పరీక్షలను డీఆర్డీఓ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎయిర్‌ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి, వైమానిక పరీక్షలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ‘ధ్వని’ పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.