న్యూఢిల్లీ : త్రిపుర రాష్ట్రానికి చెందిన ధిమన్ చక్మా(Dhiman Chakma).. ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. రెండు సార్లు యూపీఎస్సీ క్లియర్ చేసిన అతను.. అవినీతి కేసులో పట్టుబడ్డాడు. 2021 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ధిమన్ను ఒడిశాకు చెందిన విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. కలహండీ జిల్లాలో పది లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడతను. వివరాల్లోకి వెళ్తే..
ఈశాన్య రాష్ట్రాలకు ఇటీవల చక్మా రోల్‌మోడల్‌గా నిలిచాడు. త్రిపురకు చెందిన అతను సర్వీసులోకి వచ్చి నాలుగేళ్లే అవుతుంది. అతనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధరమ్ఘర్లో డిప్యూటీ కలెక్టర్‌గా చేస్తున్నాడు. ఒడిశాలోని కలహండి జిల్లాలో అదో సబ్ డివిజ్. తన పొజిషన్‌ను వాడుకుని ధిమన్ అవినీతికి పాల్పడినట్లు ఒడిశా విజిలెన్స్ ఆరోపిస్తున్నది.
క్వారీ నడిపిస్తున్న ఓ వ్యాపారి.. ధిమన్పై ఫిర్యాదు ఇచ్చాడు. 20 లక్షలు ఇవ్వకుంటే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ధిమన్ బెదిరించాడు. దీంతో తొలి దశలో పది లక్షలు ఇస్తానని ఆ వ్యాపారి ఒప్పుకున్నాడు. ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో విజిలెన్స్ టీమ్ అతన్ని పట్టుకున్నది. కెమికల్ టెస్ట్ ద్వారా ధిమన్ లంచం తీసుకున్నట్లు రుజువైంది. ఆ తర్వాత అతని ఇంటిపై జరిగిన రెయిడ్‌లో మరో 47 లక్షల నగదును సీజ్ చేశారు. ధమిన్పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు బుక్ చేశారు. రికవరీ చేసిన డబ్బుకు సంబంధించిన కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.
త్రిపురలోని కంచన్పుర్లో ధిమన్ పుట్టాడు. అతని తండ్రి ఓ స్కూల్ టీచర్.. తల్లి గృహిణి. అగర్తలాలో ఉన్న ఎన్ఐటీ కాలేజీలో అతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. 2019లో ధిమన్ తొలిసారి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. 722 ర్యాంక్ సాధించాడు. దాంతో అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఒడిశాలోని మయుర్బన్ జిల్లాలో పోస్టు కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ 2020లో సివిల్స్ రాసి 482 ర్యాంక్ సాధించాడు. ఈసారి ఐఏఎస్ అయ్యాడు. ఒడిశా క్యాడర్ అతనికి దక్కింది.
Also Read..