న్యూఢిల్లీ, జూన్ 13 : అహ్మదాబాద్‌లో గురువారం విమాన ప్రమాదం జరిగి 241 మంది మరణించిన దరిమిలా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా తనిఖీలను మరింత విస్తృతంగా నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్(డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిరిండియాకు చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా తనిఖీలో వివిధ వ్యవస్థల తనిఖీలు, టేకాఫ్ పరిమితులు మొదలైనవి ఉంటాయి. ఎయిరిండియా వద్ద 26 బోయింగ్ 787-8 విమానాలు, 7 బోయింగ్ 787-9 విమానాలు ఉన్నాయి. జీఈఎన్ఎక్స్ ఇంజిన్లతో నడిచే 787-8, 787-9 బోయింగ్ విమానాలకు తక్షణమే అదనపు నిర్వహణా చర్యలు చేపట్టాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది.
లండన్ గాట్విక్ వెళుతున్న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోగా అందులోని 242 ప్రయాణికులలో ఒకరు తప్ప మిగిలిన అందరూ మరణించారు. జూన్ 15వ తేదీ నుంచి వివిధ ఒన్-టైమ్ చెకింగ్లు బోయింగ్ 787 విమానాలకు నిర్వహించాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. వీటిలో ఇంధన పరిమితుల పర్యవేక్షణ, సంబంధిత వ్యవస్థల తనిఖీలు ఉంటాయి. ఎయిర్ కంప్రెషర్, సంబంధిత వ్యవస్థల తనిఖీ, ఇంజిన్ డ్రైవెన్ యాక్చుయేటర్-ఆపరేషనల్ టెస్ట్, ఆయిల్ సిస్టమ్ చెక్ కూడా నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ తనిఖీలు, పరీక్షల నివేదికను సమీక్ష నిమిత్తం తమకు సమర్పించాలని డీజీసీఏ కోరింది. కాగా, జీఈఎన్ఎక్స్ ఇంజిన్లను జీఈ ఏరోస్పేస్ తయారు చేస్తున్నది.