ముంబై, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, సచిన్ టెండుల్కర్, ముఖేశ్ అంబానీ వంటి వివిధ రంగాల ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించడం ఇది మూడోసారి. సీఎం, ఉప ముఖ్యమంత్రులు మినహా మంత్రులుగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మొదట ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన ఏక్నాథ్ షిండే చివరకు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. అయితే, ఉపముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే దానిపై కొన్ని గంటల ముందు వరకు గందరగోళం నెలకొంది. బీజేపీ అధిష్ఠానం, ఫడ్నవీస్ బుజ్జగించడంతో ఆయన ఎట్టకేలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.