Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి ఘన విజయం సాధించడంతో బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆధునిక అభిమన్యుడను అని, చక్రవ్యూహాన్ని ఎలా చేధించాలో తనకు బాగా తెలుసని ఆయన అన్నారు. మహాయుతి విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్.. తాను రెండు నెలల క్రితం అన్న మాటలను గుర్తుచేశారు.
ప్రతిపక్ష కూటమి తనను చిక్కుల్లో పెట్టాలని చూస్తున్నదని, కానీ తాను ఆధునిక అభిమన్యుడినని, చక్రవ్యూహంలో వెళ్లడమేగాక, బయటకు రావడం కూడా తనకు తెలుసని గత సెప్టెంబర్లో కూడా చెప్పానని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ శ్రేణులు, నేతల మద్దతుతో అఖండ విజయం సొంతమైందని చెప్పారు. ప్రజలు నరేంద్రమోదీ వెంటే ఉన్నారనడానికి ఈ గెలుపే నిదర్శనమని అన్నారు.
కొత్త సీఎం ఎవరనే అంశాన్ని కూటమిలోని మూడు పార్టీల నేతలం కూర్చుని నిర్ణయిస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం ఉండదని అన్నారు. అయితే సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీసే ముందు వరుసలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.