ముంబై: త్వరలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. (BJP’s first list) 99 మంది అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే తొలి జాబితాలో ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనుండగా, కమ్తీ నుంచి చంద్రశేఖర్ బరిలోకి దిగారు. ఘట్కోపర్ వెస్ట్ నుంచి రామ్ కదమ్, చిక్లి స్థానం నుంచి శ్వేతా మహాలే పాటిల్, భోకర్ సీటులో అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ, కంకవ్లీ నుంచి నితీష్ రాణే పోటీ చేయనున్నారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించిన బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు గట్టిగా కృష్టి చేస్తున్నది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో భాగమైన సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి పోటీ చేయనున్నది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 23న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.