Devanand | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఆ యువకుడు తీవ్రమైన కొవిడ్ భారినపడ్డాడు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దాదాపు నాలుగు నెలలు ఐసీయూలోనే గడిపాడు. ఇది చాలదంటూ రెండుసార్లు గుండెపోటు. మొత్తంగా మృత్యువు నుంచి బయటపడ్డారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. ఆయనే టెల్గోట్ దేవానంద్. మహారాష్ట్రకు చెందిన దేవానంద్ సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లి వస్తుండగా, 2021లో కొవిడ్ బారినపడ్డాడు. తెలంగాణ అదనపు డీజీపీ మహేష్ భగవత్ సహాయంతో విమానంలో ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి బేగంపేట కిమ్స్ దవాఖానలో చేర్పించారు. నాలుగు నెలలు ఐసీయూలోనే ఉన్నాడు. మరో మూడు నెలలు సాధారణ వార్డులో ఉన్నారు. చికిత్స దశలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఎక్మో చికిత్సతో కోలుకున్నాడు. ఇంట్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ తన ప్రిపరేషన్‌ను కొనసాగించారు. తాజాగా విడుదలైన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో మంచి ర్యాంకును సాధించాడు. చికిత్స, ఇంటర్వ్యూల కోసం మహేష్ భగవత్ ఎంతగానో సహాయం చేశారని దేవానంద్ గుర్తుచేసుకున్నారు. తాను ఐఏఎస్ అయ్యే వరకు విశ్రమించనని ఆయన అంటున్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తాచాటారు. నల్లగొండకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి 11వ ర్యాంక్, కరీంనగర్‌కు చెందిన చెరుకు అవినాష్‌రెడ్డి 40వ ర్యాంకు, జీ ప్రశాంత్‌రెడ్డి 25వ ర్యాంకు సాధించారు
యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)-2024 పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో కనిక అనభ్ మొదటి ర్యాంక్ సాధించారు. మొత్తం 143 మంది అభ్యర్థులను నియమించాలని యూపీఎస్సీ కేంద్రానికి సిఫారసు చేసింది. ఇందులో 40 మంది అభ్యర్థులు జనరల్ క్యాటగిరీలో, 19 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల క్యాటగిరీలో, 50 మంది ఓబీసీ విభాగంలో, 23 మంది ఎస్సీ, 11 మంది ఎస్టీ క్యాటగిరీలో ఎంపికయ్యారు.