న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)కు ప్రత్యామ్నాయంగా మరో విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ఈ చర్య అవసరమని కోర్టు పేర్కొన్నది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పర్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలకు వస్తున్న బాండ్ల అంశంపై దాఖలైన పిటీషన్ల గురించి ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. నగదు మాత్రమే తీసుకోవాలన్న పాత విధానాన్ని కోర్టు సూచిందని సీజే చంద్రచూడ్ తెలిపారు. కానీ ప్రస్తుత బాండ్ల వ్యవస్థలో ఉన్న లోపాల్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పార్లమెంట్ చట్టం ద్వారానే ఆ మార్పును తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని, కోర్టు ఆ కోణంలో జోక్యం చేసుకోలేదన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కోసం కొత్త సిస్టమ్‌ను డిజైన్ చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.