జైపూర్, డిసెంబర్ 20 : ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్‌ను ఢీ కొనడంతో మంటలు చెలరేగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం జైపూర్-అజ్మీర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 35 మంది గాయపడ్డారని… అందులో సగం మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాజస్థాన్ వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ వెల్లడించారు. ట్యాంకర్ ట్రక్‌ను ఢీ కొనప్పుడు దాని నాజిల్ దెబ్బ తిని గ్యాస్ లీకవడం వల్ల మంటలు చెలరేగి చుట్టుపక్కల వాహనాలకూ వ్యాపించాయని జైపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి.