బరేలీ: బీజేపీ పాలిత యూపీలో ‘ఐ లవ్ ముహమ్మద్’కు మద్దతుగా జరిగిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. బరేలీలో రెండు చోట్ల ఈ నిరసనల్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు తీవ్ర అభ్యంతరకర నినాదాలు చేయడమే కాక, పోలీసులపై రాళ్లు, ఇటుకలు, యాసిడ్ దాడితో పాటు , కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇద్దరు మత గురువులతో పాటు కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక వర్గానికి చెందిన సుమారు 200-250 మంది నిరసనకారులు బరేలిలో శుక్రవారం అభ్యంతరకర నినాదాలు చేస్తూ ఇస్లామియా కాలేజీ వైపు ప్రదర్శనగా వచ్చారు. అయితే అనధికార సమావేశం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని నిలువరించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నిరసనకారులు ఆగ్రహంతో ఇటుకలు, రాళ్లు, యాసిడ్తో నింపిన గ్లాస్ బాటిళ్లను పోలీసులపైకి విసిరారు. ఒకరిద్దరు వ్యక్తులు పోలీసులపై కాల్పులు కూడా జరిపారు.