ఔరంగాబాద్, జూన్ 14: ఇంట్లో తమకు చుక్కలు చూపించే భార్యలు మళ్లీ జీవిత భాగస్వాములుగా రావద్దని కొందరు పురుషులు మహారాష్ట్రలో ఆందోళనకు దిగారు. ఇంట్లో తమ భార్యల ద్వారా ఎదుర్కొనే అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళం విప్పేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సోమవారం రావి చెట్టు చుట్టు 108 ప్రదక్షిణలు చేశారు. మళ్లీ అదే భార్య జీవిత భాగస్వామిగా రావొద్దని ప్రార్థించారు. అసలు ఏం జరిగిదంటే.. తమ భార్యలతో సంతోషంగా లేని కొందరు పురుషులు తమ మనోవేదనను లేవనెత్తడానికి కొన్నేండ్ల క్రితం ఔరంగాబాద్‌లో భార్యా బాధితుల ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సోమవారం వారంతా ఆందోళనకు దిగారు. మంగళవారం వట్ పూర్ణిమా సందర్భంగా మహిళలు రావిచెట్టును మొక్కి తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తారు. ఏడు జన్మలకు అతడే జీవిత భాగస్వామిగా రావాలని వేడుకుంటారు. వట్ పూర్ణిమాకు ఒక రోజు ముందుగా సోమవారం రావిచెట్టు వద్ద పురుషులు ప్రత్యేక పూజలుచేసి, మళ్లీ అదే భార్య తమకు వద్దని దేవున్ని ప్రార్థించినట్టు ఆశ్రమ వ్యవస్థాపకుడు భారత్ ఫులారే తెలిపారు. మహిళా సాధికారత కోసం అనేక చట్టాలు చేసినా వాటిని కొందరు మహిళలు దుర్వినియోగ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పురుషుల కోసం చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.