న్యూఢిల్లీ: డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-900 విమానం గాల్లో ఉండగా, రెక్క విడిభాగం ఊడిపోయింది. అట్లాంటాలో బయల్దేరిన ఈ విమానం రాలీహ్లో సోమవారం రాత్రి సురక్షితంగా దిగింది. అయితే, ఆ మర్నాడు ఉదయం రాలీహ్లోని బన్బురి రోడ్డులోని ఓ ఇంటి నడక మార్గంలో రెక్క విడిభాగం ఆ ఇంటి యజమానికి కనిపించింది.
ఆయన పోలీసులకు ఫోన్ చేసి, తమ ఇంటి వద్ద ఓ గుర్తు తెలియని వస్తువు పడి ఉందని చెప్పారు. ఇది విమానం ఎడమవైపు రెక్కకు అంచులో ఉండే ఫ్లాప్ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. విమానం ఎగురుతుండగా ఫ్లాప్ కింద పడిపోవడం వల్ల విమానం పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్పారు. కానీ ఈ విమానం ఎటువంటి ఎమర్జెన్సీని ప్రకటించకుండానే, సురక్షితంగా కిందకు దిగింది.
ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి బయల్దేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వియన్నాలో అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అందులోని వందలాది మంది ప్రయాణికులు వియన్నా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీ తిరుగుప్రయాణం చేయాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ (ఏఐ104) ప్రయాణం కూడా రద్దు అయ్యింది.