అనంతపురం, జనవరి 10: స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్..మొదలైన కంపెనీలు అనుసరిస్తున్న విధానాలు గిగ్ వర్కర్ల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తమ సేవలను వినియోగదారుడికి వేగంగా అందజేయటం కోసం గిగ్ వర్కర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో రైల్వే స్టేషన్ వద్ద ‘ఆన్‌బోర్డ్ డెలివరీ’ కోసం ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టాడు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ..ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాడు. తాజాగా జరిగిన ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీనికంతటికీ కారణం ‘10 నిమిషాల్లో డెలివరీ’ అనే విధానమే.
ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ‘ఎక్స్’లో విడుదల కావటంతో, పలువురు నెటిజన్లు గిగ్‌వర్కర్ల వర్క్ లైఫ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక భద్రత ఏదీ అమలు జేయకుండా, వర్కర్లను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టడాన్ని పలువురు ప్రశ్నించారు. ఈ ఘటనను సమీక్షించామని, తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్ క్షేమంగానే ఉన్నాడని ‘స్విగ్గీ’ తెలిపింది. ఈ ఘటన మనదేశంలో గిగ్ వర్కర్ల దారుణమైన పని పరిస్థితుల్ని చర్చనీయాంశం చేసింది. ఎక్కువ పని గంటలు, రైడర్లకు ప్రమాద బీమా ఇవ్వక పోవటం, ప్రమాదాల తర్వాత సంస్థ నుంచి మద్దతు లేకపోవటం వంటివి ఎదుర్కొంటున్నామని గిగ్‌వర్కర్లు చెబుతున్నారు.