న్యూఢిల్లీ: డీలిమిటేషన్ అనేది పొలిటికల్ డీమానిటైజేషన్ లాంటిదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల లోక్‌సభ, రాజ్యసభ మధ్య బ్యాలెన్స్ తప్పుతుందని, ఇక డీలిమిటేషన్ బిల్లు వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు బంధీ అవుతుందని ఆయన అన్నారు. ఇవాళ లోక్‌సభలో ఎంపీ శశిథరూర్ బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియతో మహిళా రిజర్వేషన్‌ను లింకు చేయవద్దు అని అన్నారు. డీలిమిటేషన్ బిల్లులో మూడు లోపాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. డీలిమిటేషన్‌పై చాలా విస్తృత స్థాయిలో చర్చలు జరగాలన్నారు. చిన్న, పెద్ద రాష్ట్రాల మధ్య అంతరాన్ని చూడాలన్నారు. ఇక జనాభాను నియంత్రించిన రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు. డీలిమిటేషన్ బిల్లును ఆగమాగం పాస్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
డీమానిటైజేషన్(నోట్ల రద్దు) సమయంలో ప్రభుత్వం గాబరాపడిందని, ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో ఆగమేఘాల మీద రాజకీయ డిమానిటైజేషన్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం ఫార్ములా అంశాన్ని ఎంపీ శశిథరూర్ విమర్శించారు. మంత్రి ప్రకటన ప్రమాదకర రాజకీయ ప్రకటనగా ఉందని, అదేమీ శాసనపరమైన గ్యారెంటీలా లేదన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 850 సీట్లకు పెంచడం జరిగేపనిలా లేదని, దానికి తగినట్లు రాజ్యసభ సామర్థ్యాన్ని కూడా పెంచాలన్నారు. తమ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుందని, కానీ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.