న్యూఢిల్లీ, మే 10: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోగలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాలలో జననాల రేట్లు తగ్గిన కారణంగా దక్షిణాదికి పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ఆమె తెలిపారు. సరోగసీ(నియంత్రణ) చట్టం, 2021 నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై శనివారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి శిశువు సహజంగా జన్మించినప్పటికీ సరోగసీ(అద్దె గర్భం) ద్వారా రెండవ శిశువును పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అనేక జంటలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ దక్షిణాదిలో కుటుంబాలు క్షీణిస్తున్నాయని, ఇందుకు భిన్నంగా ఉత్తర భారతంలో ప్రజలు అనేకమంది పిల్లల్ని కంటూ పోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జనా భా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర భారతదేశంలోని జనాభా కారణంగా దక్షిణాదిలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోగలదన్న అపోహలు ప్రజలలో ఏర్పడ్డాయని జస్టిస్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకు పుట్టిన ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ ఉండగా సరోగసీ ద్వారా రెండో బిడ్డను పొందాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహినీ ప్రియా వాదిస్తూ ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితులు లేదా వరుసగా ఐవీఎఫ్ వైఫల్యాల కారణంగా సరోగసీని ఉపయోగించుకునేందుకు సరోగసీ (నియంత్రణ) చట్టం, 2022లోని 14వ నిబంధన కింద అర్హత పొందారని తెలిపారు. మొదటి బిడ్డ ఉన్నప్పటికీ తమ కుటుంబాన్ని విస్తరించుకోవాలని భావిస్తున్న జంటలకు ఐవీఎఫ్ విఫలం కావడంతో సరోగసీని ఆశ్రయిస్తున్నారని న్యాయవాది చెప్పారు. దీనిపై జస్టిస్ నాగరత్న సరోగసీ ఒక పోకడగానో జీవనశైలి ఎంపికగానో మారకూడదని వ్యాఖ్యానించారు.