Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 373తో చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) డేటా ప్రకారం.. నగరంలోని మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో నమోదయ్యాయి. ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి, ముండ్కా, నెహ్రూ నగర్, షాదీపూర్, సోనియా విహార్, వివేక్ విహార్, వజీర్‌పూర్‌లో గాలి నాణ్యత సూచీ చాలా అధ్వానంగా ఉంది. ఈ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 400 కంటే ఎక్కువే నమోదైంది. తీవ్ర వాయుకాలుష్యంతో ప్రజలు ఆరోగ్య సమస్యలను నివేదిస్తున్నారు. ఉదయం 8:30 గంటలకు నగరంలో తేమ స్థాయిలు 97 శాతంగా ఉన్నాయి. రోజంతా మోస్తరు పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం ఎన్సీఆర్ పరిధిలో గాలి విషపూరితంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 50శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వంలోని 80 విభాగాలు, వివిధ ఏజెన్సీలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.40 లక్షలుగా ఉన్నది. అలాగే, గురుగ్రామ్‌లోని ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నది. గురుగ్రామ్, సోనిపట్, ఫరీదాబాద్‌తో పాటు ఎన్సీఆర్లోని పలు నగరాల్లో కాలుష్యం కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. భవన నిర్మాణం, కూల్చివేతలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. పలు వాహనాలను రాజధాని ప్రాంతంలోకి అనుమతించడం లేదు.
Also Read..
Adani bribery case | అదానీ వ్యవహారంపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా
Encounter | భారీ ఎన్కౌంటర్.. పది మంది మావోలు హతం
Canada Vs India | భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ ప్రకటన