CUET-UG | న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఎన్నికైన అకడమిక్ కౌన్సిల్ సభ్యులు మిథురాజ్ ధుసియా, మోనామీ బసు ఓ లేఖలో తమ అసంతృప్తిని విశ్వవిద్యాలయం ఉప కులపతి యోగేశ్ సింగ్కు తెలిపారు. సీయూఈటీ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియలో ఫ్యాకల్టీ సభ్యుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాలను సమీక్షించాలని కోరారు. సీయూఈటీపై ఆధారపడటం వల్ల అడ్మిషన్ షెడ్యూలు, అకడమిక్ క్యాలెండర్లలో అనిశ్చితి వస్తున్నదని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రవేశ పరీక్ష నుంచి తప్పుకోవాలని కోరారు. మిడిమిడి జ్ఞానంతో, నాసిరకంగా రూపొందించిన జాతీయ విద్యా విధానం, సీయూఈటీ వంటి విధానాల వల్ల ఢిల్లీ విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నదని ఆరోపించారు. మిథురాజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ, సీయూఈటీ ఫలితాలు ఆలస్యమవుతుండటం వల్ల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లిపోతున్నారన్నారు.
సీయూఈటీలో కూడా 99 శాతం, 100 శాతం మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, వారికి ప్రవేశాలు దొరకడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. కటాఫ్ సిస్టమ్ వల్ల తరగతి గదుల్లో ప్రాంతీయ వైవిధ్యం తగ్గిపోతున్నదని చెప్పారు. దీనిపై వీసీ యోగేశ్ సింగ్ స్పందిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు.