న్యూఢిల్లీ: శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చేసింది. సుమారు 8 గంటల పాటు ఆ విమానంలో గాలిలో ఉంది. ఆ తర్వాత విమానం సురక్షితంగా మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల విమానం మార్గమధ్యలోనే తిరుగు ప్రయాణమైనట్లు ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ఆ విమానంలో సుమారు 230 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్లయిట్ ఏఐ173 విమానం.. మే 27వ తేదీన ఢిల్లీకి రిటర్న్ అయినట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొన్నది. టెక్నికల్ సమస్య వల్ల ఆ విమానం వెనక్కి వచ్చినట్లు చెప్పారు. ఎయిర్ ఇండియా సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఆ విమానాన్ని చెక్ చేయనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో చెప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆ విమానం సుమారు మూడు గంటల పాటు జర్నీ చేసి చైనా వైమానిక క్షేత్రంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా వెనుతిరిగింది.
ప్రయాణకులు, సిబ్బంది క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో .. అత్యధిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని వెనక్కి రప్పించినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఆలస్యం కలిగినందుకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 21వ తేదీన బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో అగ్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.