హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తాజా ఫలితాలు రాబోయే రోజుల్లో దేశ ప్రజల మూడ్‌ను ప్రతిబింబించాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగానే గుజరాత్ ఎన్నికల సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగేలా మోదీ సర్కార్ ఆలస్యం చేసిందని ఆరోపించారు. అయినా బీజేపీకి ఎదురుదెబ్బ తప్పలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఫలితంతో.. మోదీ మోడల్‌కు, బీజేపీకి కాలం చెల్లిందనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచేసి.. ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
మా కౌన్సిలర్లకు బీజేపీ ప్రలోభాలు: సిసోడియా
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఆప్ కౌన్సిలర్లకు బీజేపీ ఎర వేస్తున్నదని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. అయితే, తమ పార్టీ కౌన్సిలర్లు ఎవరూ ఆ పార్టీకి చిక్కరని తెలిపారు. బీజేపీలోకి రావాలని పలువురికి ఫోన్లు వచ్చాయని చెప్పారు. ‘బీజేపీ ఆట మొలైంది. మా పార్టీ కౌన్సిలర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరైనా ఫోన్ చేసినా వాటిని రికార్డు చేయాలని కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు సూచించాం’ అని సిసోడియా ట్వీట్ చేశారు.