Bibhav Kumar : స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు (Delhi police) సీఎం కేజ్రీవాల్ (Kejriwal) పీఏ బిభవ్‌కుమార్ (Bibhav Kumar) కు వ్యతిరేకంగా తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది.
ఈ సందర్భంగా పోలీసులు కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చారు. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. బిభవ్‌కుమార్‌ను ఈ నెల 30న భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ కేసు పెట్టారు.
దాంతో మే 19న పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. చివరగా చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, బీజేపీతో చేయి కలిపి ఆప్ ప్రతిష్ఠను మసకబార్చేందుకే స్వాతిమాలివాల్ ఇలాంటి ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. స్వాతిమాలివాల్ ప్రస్తుతం ఆప్ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.