న్యూఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠా గత ఐదేండ్లుగా 5 వేల నకిలీ వీసాలు తయారు చేసి 300 కోట్లు ఆర్జించిందన్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ నెల 2న డిల్లీ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాతో స్వీడన్ వెళ్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా, ఈ నకిలీ వీసా తయారీ ముఠా గుట్టు రట్టయ్యింది.
తొలుత బల్బీర్ సింగ్, జస్వీందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తిలక్‌నగర్‌లోని ఒక ఫ్యాక్టరీలో మనోజ్ మోంగా అనే వ్యక్తి వీటిని తయారు చేస్తున్నట్టు వారు తెలిపారు. పోలీసులు ఫ్యాక్టరీపై దాడి చేసి మనోజ్ మోంగాను అరెస్టు చేశారు.
ముఠా సభ్యులు ప్రతినెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తారు. వీసాల స్టిక్కర్‌ను 20 నిమిషాల్లో తయారు చేయడం విశేషం. ప్రతి నకిలీ వీసాను రూ.8-10 లక్షలకు అమ్మేవారు. ఇలా గత ఐదేండ్లలో ఐదు వేల మందిని ఈ నకిలీ వీసాల ద్వారా విదేశాలకు పంపినట్టు వారు చెప్పారు.