న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆతిశీ ఆమోదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ సొంత రాజకీయ అజెండా కోసం పాకులాడుతున్నదని గెహ్లాట్ ఆరోపించారు. అయితే గెహ్లాట్ ప్రస్తుతం ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని, ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో అవకాశం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు.
ఒక పక్క మంత్రి పార్టీకి రాజీనామా చేయగా, మరో పక్క ఆప్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా చేరారు. వాయువ్య ఢిల్లీ నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఆదివారం కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లో చేరారు. బీజేపీ అధిష్ఠానంపై భ్రమలు తొలిగాయని, అందుకే తాను ఆప్‌లో చేరినట్టు ఆయన తెలిపారు.