HomeNationalDelhi L G Vinai Saxena Replies To Cm Arvind Kejriwal
సమావేశానికి రండి
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు.
ఢిల్లీ సీఎంకు ఎల్జీ సందేశం
న్యూఢిల్లీ, జనవరి 26: ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు. సీఎంతోపాటు మంత్రులు, 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు రావొచ్చన్నారు. అయితే పంజాబ్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎం కోరారు. ప్రతి శుక్రవారం ఎల్జీ, సీఎం సమావేశం అవుతారు. ఇటీవలి విభేదాల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగడం లేదు.
ఉపాధ్యాయుల శిక్షణ వ్యవహారంపై ఎల్జీ, ఆప్ సర్కారు మధ్య తీవ్ర వివాదం నడుస్తున్నది. టీచర్లను శిక్షణ కోసం పంపాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఎల్జీ దాన్ని తిరస్కరించారు. దీన్ని నిరసిస్తూ ఇటీవల ఆప్ నేతలు రాజ్‌నివాస్‌కు ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా తమతో భేటీ అయ్యేందుకు ఎల్జీ నిరాకరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా సీఎంకు సమావేశానికి రావాలని ఎల్జీ సందేశం పంపడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకు ఆప్
ఢిల్లీ మేయర్ ఎన్నికను నిర్ణీత కాలంలోగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొందరు కౌన్సిలర్లు గొడవ వల్ల గత మంగళవారం ఎల్జీ నియమించిన ప్రిసైడింగ్ అధికారి నిరవధికంగా సభను వాయిదా వేయడంతో రెండోసారి కూడా మేయర్ ఎన్నిక నిలిచిపోయింది. బీజేపీ కౌన్సిలర్లు ముందస్తు ప్రణాళికతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆప్ ఆరోపించింది.
ఫోన్లో తమిళనాడు సీఎంకు ఆహ్వానం
చెన్నై: తమిళనాడు సర్కారు, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ తేనీటి విందుకు హాజరుకావాలని సీఎం స్టాలిన్‌ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఫోన్లో ఆహ్వానించారు. సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులు విందుకు హాజరయ్యారు. అయితే, డీఎంకే భాగస్వామ్యపక్షాలు వీసీకే, టీవీకే మాత్రం గవర్నర్ విందును బహిష్కరించాయి.