న్యూఢిల్లీ, మార్చి 24: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నగదు బయటపడడంపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని కొందరు డిమాండు చేయగా జస్టిస్ వర్మను అభిశంసించాలని మరికొందరు సూచించారు. ఇది చాలా పెద్ద విషయమని, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతిన్నదని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సోమవారం అభిప్రాయపడ్డారు. ఒక న్యాయమూర్తి నివాసంలో గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన అన్నారు. జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని సంజయ్ సింగ్ డిమాండు చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్ కూడా చర్చించాలని ఆయన సూచించారు. డబ్బు దొరకకపోయినా ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పారేస్తారని, కాని కోట్ల కొద్దీ దొరికినా(ఈ కేసులో) దర్యాప్తు మాత్రం నిర్వహించరని పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా, జస్టిస్ వర్మ వ్యవహారంపై సీజేఐ సంజీవ్ ఖన్నా కమిటీని ఏర్పాటు చేయడం ఒక ముందడుగని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పార్లమెంట్లో ఓ ప్రకటన చేయాలని ఆయన కోరారు. న్యాయ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం నెమ్మదిగా సడలిపోతోందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రజలలో విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస ్థపైనే ఉందని ఆయన చెప్పారు. ఓ సిట్టింగ్ జడ్జి రాజీనామా చేసి మరుసటి రోజు ఓ రాజకీయ పార్టీలో చేరిన ఉదంతం మనం చూశామని, ఓ సీజేఐ పదవీ విరమణ చేసి పార్లమెంట్ సభ్యుడిగా వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, నోట్ల కట్టల వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
జస్టిస్ యశ్వంత్ వర్మకు ఢిల్లీ హైకోర్టు సోమవారం అధికారిక బాధ్యతలను ఉపసంహరించింది. ఇదిలా ఉండగా, జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక. తుది ప్రకటన వెలువడనున్నది.
అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు నిర్ణయించారు.