indiGo | విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల అనంతరం తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల సుంకాన్ని తిరిగి ఇప్పించాలంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కస్టమ్స్ విభాగానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఇలాంటి కేసుల్లో కస్టమ్స్ సుంకం విధించడం రాజ్యాంగ విరుద్ధమని.. అదే లావాదేవిలపై డబుల్ టాక్సేషన్ విధింపునకు సమానమని కంపెనీ కోర్టులో వాదించారు.
మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్‌గా పరిగణించాలని.. తాజా వస్తువుల దిగుమతిగా కాదని ఇండిగో వాదిస్తున్నది. అందుకు అనుగుణంగానే పన్ను విధించాలని కోరుతున్నది. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై డబుల్ లెవీగా వాదనలు వినిపించారు. ఇండిగో ఇప్పటికే ఇప్పటికే దిగుమతి చేసుకునే సమయంలో ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని.. మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించామని ఇండిగో చెబుతున్నది. కస్టమ్స్ అధికారులు మళ్లీ దిగుమతి చేసుకున్నామంటూ తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేసినట్లుగా కంపెనీ వాదించింది.
మరమ్మతుల తర్వాత మళ్లీ దిగుమతులపై రెండుసార్లు సుంకాలు విధించలేరని గతంలోనే కస్టమ్స్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. అయితే, ట్రిబ్యునల్ తర్వాత మినహాయింపు నోటిఫికేషన్‌ను సవరించిందని.. అలాంటి మార్పులు భవిష్యత్తులో వర్తిస్తాయని చెప్పింది. అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనివ్వకపోవడంతో తప్పని పరిస్థితిలో 4వేల కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకుపైగా డిపాజిట్ చేసినట్లు విమానయాన సంస్థ పేర్కొంది.కస్టమ్స్ విభాగం ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ఈ సమస్యకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని.. దీనిపై ఎలాంటి స్టే విధించలేదని కోర్టుకు తెలిపింది. స్పందన తెలిపేందుకు సమయం కోరగా.. కోర్టు అంగీకరించింది.