న్యూఢిల్లీ: ఐఆర్ఎస్ ఆఫీసర్, మాజీ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే(Sameer Wankhede) కేసులో కేంద్రానికి 20 వేల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. సమీర్ వాంఖడే ప్రమోషన్‌కు చెందిన కేసులో దాఖలు చేసిన పిటీషన్లో కొన్ని వాస్తవాలను దాచిపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఫైన్ వేసింది. జస్టిస్ నవీన్ చావ్లా, మధు జైన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అభ్యర్థన దాఖలు చేయడానికి ముందు కేంద్రం అన్ని అంశాలను వాస్తవికంగా చెప్పాలని ధర్మాసనం పేర్కొన్నది. షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఓ రేవ్ పార్టీ కేసులో అరెస్టు చేసిన సమయంలో సమీర్ వాంఖడే అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రస్తుతం సమీర్ వాంఖడే ఆర్థిక శాఖకు చెందిన రెవన్యూ డిపార్టమెంట్లో అదనపు కమీషనర్‌గా చేస్తున్నారు. షారూక్ కుమారుడిని అరెస్టు చేసిన సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ముంబై జోనల్ డైరెక్టర్‌గా చేశారు. ఒకవేళ అర్హుడైతే వాంఖడేను జాయింట్ కమీషనర్‌గా ప్రమోట్ చేయాలని కేంద్రానికి క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29వ తేదీన తన తీర్పులో సమర్థించింది.