Delhi High Court : ఢిల్లీ ఓల్డ్ రాజేందర్నగర్లోని రవూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందని ఘటనపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇవాళ ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు బాధ్యులకు చీవాట్లు పెట్టింది.
ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని కోర్టు విమర్శించింది. వందల ఏళ్ల నాటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చకుండా నిబంధనలకు విరుద్ధంగా అలాగే ఎందుకు కొనసాగిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఆ కోచింగ్ సెంటర్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండి ఉంటే సెల్లార్లోకి నీళ్లు ఎలా వెళ్లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధికారుల దివాళాకోరుతనం వల్ల అనర్థం జరిగిందని మండిపడింది. అధికారులను దివాళాకోరులు అంటున్నందుకు తనను క్షమించాలని వ్యాఖ్యానించింది. అధికారులు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని చీవాట్లు పెట్టింది. ఈ ఘటనలో అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఫైరయ్యింది.
ఓల్డ్ రాజేందర్ దుర్ఘటనపై విచారణ చేపట్టాలని కోరుతూ అడ్వకేట్ రుద్ర విక్రమ్ సింగ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటన కొత్తదేమీ కాదని, గతంలో ముఖర్జి నగర్లో జరిగిన ఘటన, వివేక్ విహార్ అగ్నిప్రమాద ఘటన కూడా ఈ కోవకు చెందినవేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది తన పిటిషన్లో కోర్టును కోరారు.
ముఖర్జినగర్ ఘటనపై విచారణ సందర్భంగా నాడు హైకోర్టు.. ఢిల్లీలోని అక్రమ కోచింగ్ సెంటర్లన్నింటినీ మూసివేయాలని ఆదేశించిన విషయాన్ని పిటిషనర్ గుర్తుచేశారు. కాగా ఈ నెల 27న ఓల్డ్ రాజేందర్ నగర్లోని రవూస్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరడంతో సెల్లార్లో చదువుకుంటున్న ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు నీట మునిగి మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు.