న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార దోషికి (Unnao Rape Convict) ఢిల్లీ హైకోర్టు రెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగర్‌కు కంటి శస్త్రచికిత్స కోసం ఈ మేరకు ఊరట ఇచ్చింది. ఫిబ్రవరి 5న జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు సస్పెండైన బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌పై ఆరోపణలు వచ్చాయి. 2019లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై నమోదైన అత్యాచారం, ఇతర కేసుల విచారణను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేశారు. సెంగర్‌ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది.
కాగా, కుల్దీప్ సింగ్ సెంగర్‌కు కంటి శస్త్రచికిత్స కోసం రెండు రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా పేర్కొన్న తేదీలో ఆయనకు సర్జరీ జరుగలేదని, ఫిబ్రవరి 4న ఖరారు చేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది ఈ పిటిషన్‌ను వ్యతిరేకించారు.
మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిష్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఫిబ్రవరి 4న ఎయిమ్స్‌లో సెంగర్‌కు కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 5న జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది.