న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) బ్యాచిలర్స్ డిగ్రీ అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించే అంశంలో ఫైలింగ్ అయిన అభ్యర్థనలకు స్పందించాలని హైకోర్టు పేర్కొన్నది. అయితే ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చింది కోర్టు. చీఫ్ జస్టిస్ దేవేందర్ కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆగస్టులో ఇచ్చిన ఏకసభ్య జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ జరగాల్సిన అప్పీల్ ఆలస్యం అవుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
ఢిల్లీ వర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఈ కేసుపై 2026, జనవరి 16వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు చెప్పింది. ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్ ఇచ్చిన ఆదేశాలను ఆగస్టులో సింగిల్ జడ్జీ పక్కనపెట్టేశారు. ఆ జడ్జీ ఆదేశాలను సవాల్ చేస్తూ మొత్తం నాలుగు అప్పీల్స్ కోర్టులో దాఖలయ్యాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్త నీరజ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, అడ్వకేట్ మొహమ్మద్ ఇర్షద్ వేసిన పిటీషన్లను ధర్మాసనం విచారిస్తున్నది.
ప్రధాని మోదీ ప్రజాజీవితంలో ఉన్న కారణంగా, ఆయన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని ఆగస్టు 25వ తేదీన ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీంట్లో ప్రజా ఆసక్తి కన్నా.. పారదర్శకత ముఖ్యమని, సమాచారంతో సెన్షేషన్ క్రియేట్ చేయడం కాదు అని సింగిల్ జడ్జీ పేర్కొన్నారు.
ఆర్టీఐ కార్యకర్త నీరజ్ వేసిన దరఖాస్తు కారణంగా.. 1978లో బీఏ పరీక్ష పాసైన వారి రికార్డులను పరిశీలించాలని 2016, డిసెంబర్ 21వ తేదీన సీఐసీ ఆదేశాలు జారీ చేసింది.ఆ ఏడాదిలోనే ప్రధాని మోదీ తన డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.