న్యూఢిల్లీ : యువతీ, యువకులకు గల ప్రేమించుకునే హక్కును పరిరక్షించే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అదే సమయంలో వారి భద్రత, సంక్షేమానికి భరోసా ఉండాలని తెలిపింది. టీనేజ్ చివరి దశలో ఉన్నవారు ఇష్టపూర్వకంగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నపుడు, వారిని శిక్షించడం మీద కన్నా, అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని చెప్పింది.
నిర్బంధం లేని, పరస్పర ఇష్టపూర్వకమైన సంబంధాలను అంగీకరించే చట్టం రావాలని పేర్కొంది. టీనేజ్ చివరి సంవత్సరాల్లో ఉన్నవారు పరస్పర సమ్మతితో ఏర్పాటు చేసుకునే లైంగిక సంబంధాలను లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం ప్రకారం నేరంగా పరిగణించడాన్ని విమర్శించింది. ఇటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు సామాజిక, చట్టపరమైన దృక్పథాలు ఉండాలని జస్టిస్ జస్మీత్ సింగ్ చెప్పారు.