శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 00:10:59

2 కోట్ల పరిహారం ఇప్పించండి!

2 కోట్ల పరిహారం ఇప్పించండి!
  • కోర్టును ఆశ్రయించిన బాధిత జామియా విద్యార్థి
  • స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా గత డిసెంబర్‌ 15న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో చేపట్టిన ఆందోళనల్లో భాగంగా పోలీసులు జరిపిన దాడుల్లో తాను గాయాలపాలయ్యానని, ఇందుకుగానూ తనకు రూ 2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ జామియా వర్సిటీకి చెందిన షాయాన్‌ ముజిబ్‌ అనే విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని విచారించిన కోర్టు.. బాధితునికి పరిహారం అందించే విషయంలో తమ స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర సర్కారుతో పాటు, ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం, ఢిల్లీ నగర పోలీసులను సోమవారం ఆదేశించింది. సీఏఏకి వ్యతిరేకంగా జామియా వర్సిటీ విద్యార్థులు డిసెంబర్‌ 15వ తేదీ నాడు చేపట్టిన ఆందోళన కార్యక్రమం చివరికి విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో వర్సిటీ పాత రీడింగ్‌ హాల్‌లోకి ప్రవేశించిన పోలీసులు విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కొట్టడంతో తన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, అందుకుగానూ ప్రభుత్వం నుంచి తనకు రూ. 2 కోట్ల పరిహారం ఇప్పించాలని ముజిబ్‌  కోర్టును కోరారు. మరోవైపు, జామియా ఘటనలో బీజేపీ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాంగ్రెస్‌ విమర్శించగా.. ఈఘటనకు కాంగ్రెస్‌ రాజకీయ రంగు పులుముతున్నదని, దేశ వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ మద్దతిస్తున్నదని బీజేపీ ఆరోపించింది. 


logo