న్యూఢిల్లీ: ఒక షాపు ఓనర్ నుంచి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకున్నాడు. ట్రాప్ చేసిన సీబీఐ అధికారులు అతడ్ని నాటకీయంగా పట్టుకున్నారు (Dramatic CBI Raid). అయితే సీబీఐ అధికారుల పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ పలుసార్లు ప్రయత్నించాడు. దీంతో జనం కూడా ఆ పోలీస్‌ను పట్టుకోవడంలో సీబీఐ అధికారులకు సహకరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఒక షాపు యజమాని నుంచి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ షాపు వద్ద అక్రమంగా వాహనాలు నిలుపుతున్నారని ఆ పోలీస్ ఆరోపించాడు.
కాగా, లంచం డిమాండ్ చేసిన విషయాన్ని ఆ షాపు యజమాని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు సీబీఐ అధికారులు ట్రాప్ వేశారు. ఆ షాపు యజమాని నుంచి పోలీస్ డబ్బులు తీసుకున్న తర్వాత అనూహ్యంగా వారు రంగప్రవేశం చేశారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తన కారు వద్దకు వెళ్లి లంచంగా తీసుకున్న డబ్బును అందులోకి విసిరేశాడు. అయితే కొందరు స్థానికుల సహాయంతో ఆ పోలీస్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch: दिल्ली के मंगोलपुरी इलाके में सीबीआई की रेड का वीडियो सामने आया है। अवैध पार्किंग को लेकर एक पुलिसकर्मी ने दुकानदार से 50 हजार रुपये रिश्वत की डिमांड की थी। इसकी जानकारी पर सीबीआई ने रंगेहाथ उस हेड कॉन्स्टेबल को दबोच लिया।#Delhi #CBI #Viralvideo pic.twitter.com/D1kII2G3zQ
— Hindustan (@Live_Hindustan) July 12, 2023