(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : లక్షలు పెట్టి మీరు ఓ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేశారు. మూడు, నాలుగు తరాలపాటు నిర్మాణానికి ఏ ఢోకా లేదంటూ విక్రయించే సమయంలో బిల్డర్ నమ్మబలికాడు. కొనుగోలు ఒప్పందం కూడా పూర్తైంది. తీరా.. ఇంట్లోకి చేరాక కొన్నాండ్లకే ఆ ఫ్లాట్ శిథిలావస్థకు చేరితే? ఉండటానికి కూడా ఏ మాత్రం పనికిరాకపోతే? ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే సామాన్యులకు ఢిల్లీలోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఊరటనిచ్చింది. నాణ్యమైన ఇల్లు కట్టివ్వలేని బిల్డర్‌పై దావా వేసే అవకాశం వినియోగదారుడికి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఢిల్లీలోని ఇంద్రపురీలో మధుబాల అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తున్నారు. 1996లో ఓ బిల్డర్ దగ్గరనుంచి ఓ అపార్ట్మెంట్లో ప్లాట్‌ను వీళ్లు కొనుగోలు చేశారు. కొంతకాలానికి ఆమె భర్త మరణించారు. దీంతో ఆ ఫ్లాట్‌ను తన పేరుమీద మార్చుకోవడానికి, అందులో నివాసం ఉండటానికి ఎంతో కష్టపడ్డారు. అన్ని చిక్కులను పరిష్కరించుకొని చివరకు 2019లో ఫ్లాట్‌లో నివాసానికి సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే ఆ ఫ్లాట్ శిథిలావస్థకు చేరింది. నిర్మాణంలో నాణ్యతను పాటించకపోవడంతోనే అతికొద్దికాలంలోనే ఈ ఫ్లాట్ ఈ స్థితికి చేరినట్టు ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో రూ. 20 లక్షలను ఖర్చు చేసి ఆమె ఫ్లాట్‌ను పునరుద్ధరించుకొన్నారు. అయితే, తనకు నాణ్యతలేనటువంటి ఫ్లాట్‌ను కట్టబెట్టిన బిల్డర్ నుంచి తగిన పరిహారం ఇప్పించాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అయితే, ఒప్పందం అప్పటికే జరిగిపోవడమే కాకుండా ఫిర్యాదుదారు ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నందున సదరు వ్యక్తిని వినియోగదారుడిగా పరిగణించలేమని జిల్లా వినియోగదారుల కమిషన్ కేసును కొట్టేసింది. దీంతో ఆమె రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఫిర్యాదుదారు పిటిషన్‌ను ఇటీవల విచారించిన రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఒప్పందం పూర్తైన తర్వాతే కాకుండా ఇంట్లో నివసిస్తున్నప్పుడు కూడా ఇంటి నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తే.. వినియోగదారుడు సదరు బిల్డర్ నుంచి పరిహారాన్ని కోరవచ్చని చెప్పింది.