Delhi Bomber : ఢిల్లీ (Delhi) లో ఇటీవల ఆత్మాహుతి దాడికి పాల్పడి 13 మంది మరణానికి కారణమైన ఉగ్రవాది (Terrorist) ఉమర్ ఉన్ నబీ (Umar Un Nabi) ఎప్పుడూ పేరుమోసిన టెర్రరిస్ట్ బుర్హాన్ వాని (Burhan Wani) హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేవాడట. ఢిల్లీ పేలుడు (Delhi blast) కేసులో అధికారులు దర్యాప్తు చేసినాకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వైట్ కాలర్ ఉగ్రవాదుల మూకకు ఉమర్ తనను తాను సేనాధిపతిగా చెప్పుకునేవాడని తెలిసింది. తమ టెర్రర్ డాక్టర్స్ మాడ్యూల్‌కు ఉమర్ నాయకుడిలా ప్రవర్తించేవాడని, ఒక రాకుమారుడిలా వ్యవహరించేవాడని అతని తోటి ఉగ్రవాదుల విచారణలో వెల్లడించినట్లు అధికారులు చెప్పారు.
2016లో భద్రతాబలగాలు పేరుమోసిన ఉగ్రవాది బుర్హాన్ వానిని మట్టుబెట్టారని, అందుకు తాను ప్రతాకారం తీర్చుకుంటానని ఉమర్ తరచూ అంటూ ఉండేవాడని, ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో మరో ఉగ్రవాది ముజామిల్ షకీల్ చెప్పినట్లు తెలిసింది. ఉమర్ చాలా తెలివైన వాడని, అతడు తలుచుకుంటే సులువుగా అణుబాంబులు తయారుచేసేవాడని ముజామిల్ చెప్పినట్లు సమాచారం.
‘ఉమర్‌ను ఆపడం ఎవరివల్ల అయ్యేది కాదు. అతని మాటలు వాస్తవికంగా, పరిశోధాత్మకంగా ఉండేవి. అతడు తనకు తానుగా సేనాపతిగా చెప్పుకునేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తన ఆఖరి క్షణం వరకు అతడు అదే పద్ధతిని కొనసాగించాడు. అయితే అతడు అంతా మతం కోసమే తప్ప మరోటి కాదు’ అని దర్యాప్తు అధికారులతో ముజామిల్ చెప్పినట్లు తెలుస్తోంది.