Delhi Blast Case | జమ్మూ కశ్మీర్ పోలీసుల రాష్ట్ర దర్యాప్తు బృందం (SIA) శనివారం ‘వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్’ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వ్యక్తిని నగరంలోని బట్మలూ ప్రాంతానికి చెందిన తుఫెల్ నియాజ్ భట్‌గా గుర్తించారు. ఈ మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా అరెస్టు చేశారు. సమాచారం మేరకు.. అక్టోబర్ మధ్యలో బన్‌పోరా, నౌగామ్లలో పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తూ వెలిసన పోస్టర్లపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (శ్రీనగర్) డాక్టర్ జీవీ సుందర్ చక్రవర్తి స్వయంగా దర్యాప్తునకు నాయకత్వం వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తూ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో మొదట ముగ్గురు అనుమానితులు అరెస్టయ్యారు. ఆరిఫ్ నిసార్ దార్ (అలియాస్ సాహిల్), యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ (అలియాస్ షాహిద్) అరెస్టు చేసి విచారించగా.. మాజీ పారామెడిక్ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అరెస్టయ్యాడు. విచారణలో పోస్టర్లు సరఫరా చేసినట్లు తేలింది. కేసు మరింత విచారించగా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం వరకు చేరింది. డాక్టర్ ముజఫర్ గనై, డాక్టర్ సయీద్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.