Vivek Venkataswamy | నర్సాపూర్, నవంబర్ 22 : నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారఖ్ చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే సునీతాలలక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని మహిళలను కోరారు. ఇందిరమ్మ చీరలతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్లను ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు.
బ్యాంకుకు మంచిగా రుణాలు కట్టుకుంటే తిరిగి ఎక్కువ రుణాలు బ్యాంకు ఇచ్చే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం రాయారావు చెరువులో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు.
ప్రతి నెలా వచ్చి చెక్కులను పంపిణీ చేయాలి- ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్ చెక్కులను లబ్దిదారులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి నెల నెల మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. మంత్రుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఆలస్యం జరగడంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్కులతో పాటు ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం కూడా పంపిణీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు నియోజకవర్గంలోని మండలాల మహిళలకు సరిపోయేంత పంపిణీ చేయలేదని, అందరికి సరిపోయేలా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు.
కేవలం స్వయం సహాయక సంఘాల మహిళలకే కాకుండా అందరి మహిళలకు చీరలను పంపిణీ చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. అలాగే వర్షాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల కారణంగా నల్లబడ్డ వడ్లను కూడా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. సన్న వడ్ల మాదిరిగానే దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలని, సింగూర్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.
వర్గాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని, అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. నేడు నిర్వహించిన కార్యక్రమానికి లబ్దిదారులు మధ్యాహ్నం 12 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం కావడంతో లబ్దిదారులు నీరు, భోజనం లేక ఇబ్బందులు పడ్డారని, ఇది మళ్లీ పునఃరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు, ఆర్డీవో మహిపాల్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసిల్దార్ శ్రీనివాస్ లబ్దిదారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం :
నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో అధికారిక కార్యక్రమం జరుగుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రేస్, జై రెవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుల నినాదాలతో ఒక్కసారిగా సభా వాతావరణం వేడెక్కింది.
జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా మంత్రి వారిని వారించకపోవడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎంతలా కాంగ్రెస్ నాయకులు నినాదాలను ఆపకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు సైతం జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై సునీతమ్మా అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఇరు పార్టీల నినాదాలతో సభలో వాతావరణం కాసింత వేడెక్కింది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అధికారిక కార్యక్రమాలను చేపట్టామని ఎన్నడూ పార్టీల పరంగా చేయలేదని, అధికారిక కార్యక్రమాలకు రాజకీయ రంగు పులమవద్దని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని, అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టేనని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు.


