Delhi Airport : భారత్, పాకిస్థాన్ (India, Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi airport) నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఆదివారం రద్దు చేశారు. ఎయిర్‌పోర్టు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోగల 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మొత్తం 100 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
దేశీయ విమాన సర్వీసుల్లో 52 అవుట్ గోయింగ్ సర్వీసులు, 44 ఇన్ కమింగ్ సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా ఒక అంతర్జాతీయ అవుట్ గోయింగ్ విమాన సర్వీసు రద్దయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (DIAL) వర్గాలు వెల్లడించాయి. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టు కార్యకలపాలు సాధారణంగానే సాగుతున్నాయని, అయితే ఎయిర్‌స్పేస్ డైనమిక్స్‌లో మార్పులు, పెరిగిన భద్రతా చర్యలవల్ల.. కొన్ని విమానాల షెడ్యూళ్లు, సెక్యూరిటీ చెక్ పాయింట్ ప్రాసెసింగ్ వేళలు ప్రభావితమయ్యాయని DIAL పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని DIAL ఆపరేట్ చేస్తోంది. ఇది దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. శనివారం భారత్-పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. అయితే ఈ అంగీకారం కుదిరిన కాసేపటికే పాకిస్థాన్ మాట తప్పింది. ఆర్ఎస్ పుర సెక్టార్లో భారత సైన్యంపై దాడికి పాల్పడింది. ఈ దాడిని తిప్పికొట్టే క్రమంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఒక ఎయిర్‌ఫోర్స్ జవాన్, ఒక బీఎస్ఎఫ్ ఎస్ఐ వీర మరణం పొందారు.