Delhi Pollution | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. గురువారం నగరమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. పరిశుభ్రమైన గాలిని పీల్చుకునేందుకు గల ప్రాథమిక హక్కు ప్రశ్నార్థకమైంది. న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలపైనా దీని ప్రభావం పడింది. 300కుపైగా విమానాల రాకపోకల్లో జాప్యం జరిగింది. ఇక్కడి నుంచి బయల్దేరాల్సిన 88 శాతం విమానాలు, ల్యాండ్ అవ్వాల్సిన 54 శాతం విమానాలు ఆలస్యమయ్యాయి.
ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) వరుసగా రెండో రోజు గురువారం ‘తీవ్రమైన’ విభాగంలో 430గా నమోదైంది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) మూడో దశ కింద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ పలు ఆంక్షలు విధించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి నగరంలోకి విద్యుత్తు, సీఎన్జీ, బీఎస్-4 డీజిల్ బస్సులు మినహా మిగతా అంతర్రాష్ట్ర బస్సుల ప్రవేశాన్ని నిషేధించింది. నగరంలో నిర్మాణ, కూల్చివేతలు, మైనింగ్ పనులను ఆపేయాలని ఆదేశించింది. ప్రధాన రోడ్లపై నీళ్లు చల్లాలని సూచించింది. ఐదో తరగతి లోపు విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించొద్దని, ఆన్లైన్ తరగతులు జరపాలని ఆదేశించినట్టు సీఎం ఆతిశీ ప్రకటించారు.