Defense Ministry | భారత నావికా దళానికి తొమ్మిది సముద్ర నిఘా విమానాలు, కోస్ట్‌గార్డ్‌కు ఆరు గస్తీ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద దేశంలో 15 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేయనున్నారు. వీటితో పాటు సీ-295 రవాణా విమానాలను సైతం తయారు చేయనున్నారు. ఈ డీల్ విలువ మొత్తం రూ.29వేలకోట్లు. రక్షణ మంత్రిత్వ శాఖ కాన్పూర్‌కు చెందిన కంపెనీతో రూ.1752.13 కోట్లతో ఒప్పందం చేసుకున్నది.
ఈ డీల్ కింద 12.7 ఎంఎం రిమోట్ కంట్రోల్డ్ గన్స్ 463 కొనుగోలు చేయనున్నది. ఈ గన్స్‌ను నేవీతో పాటు కోస్ట్‌గార్డ్ సిబ్బందికి అందించనున్నారు. ఈ ఒప్పందాలు భారతదేశ సముద్రశక్తిని పెంచడంతో పాటు స్వావలంభన భారత్‌కు ప్రోత్సాహం అందిస్తాయని రక్షణశాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ సంయుక్తంగా విమానాలను తయారు చేయనున్నారు. వీటిలో అత్యాధునిక రాడార్, సెన్సార్లు అమరుస్తారు. హిందు మహాసముద్రంలో పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్నది.
అదే సమయంలో అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలపై దాడులు పెరుగుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సామర్థ్యం నిరంతరం పెంచుకుంటున్నది. భారత వైమానిక దళం అందుకున్న మొదటి సీ-295 రవాణా విమానం స్పెయిన్‌లో చేయగా.. ఒప్పందం ప్రకారం, 16 విమానాలను స్పెయిన్‌లో తయారు చేస్తారు. మిగతా 40 విమానాలను గుజరాత్‌లోని వడోదరలో టాటా కంపెనీ తయారు చేయనున్నది.